Follow Social Media Channels
ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందో మరో జాతీయ సర్వే తేల్చేసింది. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీ వెనుకబడిందన్న దానిపై జాతీయ సర్వే చాలా స్పష్టమైన అంచనాల్ని ఇవాళ వెలువరించింది. దీని ప్రకారం ఇప్పటివరకూ అనుకుంటున్న లెక్కలన్నీ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు పొత్తులతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ లెక్కలు వారికి ఊరటనిచ్చేలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఓటర్లు పట్టంగట్టబోతున్నారనే అంశంపై జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే- సీఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ (India Today-C Voter Mood of the Nation Survey) పేరుతో తాజాగా సర్వే చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా నాలుగు ప్రధాన శక్తుల తాజా పరిస్ధితి ఏంటన్నది తేలిపోయింది. ఇందులో టీడీపీ-జనసేన కూటమి ఓట్ల శాత పరంగా స్వల్పంగా ముందున్నట్లు కనిపిస్తున్నా సీట్ల పరంగా చూస్తే రెట్టింపు స్దాయిలో దూసుకుపోతున్నట్లు తేలింది.
ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీ-జనసేన కూటమి 17 సీట్లు సాధించబోతున్నట్లు తేలింది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ప్రస్తుతం ఉన్న 22 సీట్ల నుంచి కేవలం 8 సీట్లకు పడిపోతున్నట్లు తేలింది. దీంతో ఈ మూడు పార్టీలు మాత్రమే ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చేసింది. అలాగే ఆయా పార్టీలు సాధించే ఓట్ల శాతాల్ని కూడా వెల్లడించింది.
టీడీపీ-జనసేన కూటమికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు దక్కబోతున్నట్లు ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది. అలాగే అధికార వైసీపీకి 41 శాతం ఓట్లు దక్కబోతున్నాయి. కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లను, బీజేపీ 2.1 శాతం ఓట్లను మాత్రమే సాధించబోతున్నట్లు సర్వే తేల్చింది. ఈ లెక్కన అసెంబ్లీ సీట్లలో చూసుకుంటే టీడీపీ-జనసేన కూటమికి 119 సీట్లు, వైసీపీకి 56 సీట్లు వస్తాయన్నమాట.