Follow Social Media Channels
ఎన్నికల సమయంలో ప్రకాశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో వైసీపీ సీనియర్ నేత బాలినేని కొద్ది రోజులుగా ఎంపీకి మాగుంట సీటు కోసం పట్టుబట్టారు. అక్కడ చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. బాలినేని ఎట్టకేలకు రాజీ పడ్డారు. ఇదే సమయంలో జిల్లా నుంచి మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లాలోని ఎనిమిది స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది.
అభ్యర్దుల ఖరారు: ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ అభ్యర్దుల పైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఒంగోలుతో పాటుగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. మాగుంటనే ఎంపీగా కొనసాగించాలని పట్టుబట్టిన బాలినేని తాజాగా చెవిరెడ్డితో సమావేశమయ్యారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని మిగిలిన స్థానాలకు సీఎం జగన్ ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ సారి మెజార్టీ స్థానాలు గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కౌంటర్ వ్యూహాలు చేస్తోంది.
టీడీపీ లిస్టు సిద్దం: ఇటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 12 సీట్లకుగాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. దర్శి స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు ఖరారు అయినట్లు సమాచారం. గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఏలూరి సాంబశివరావు (పరుచూరు), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి-ఎస్సీ) నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. మరో ఐదు సీట్లలో కూడా ప్రస్తుత ఇన్చార్జులనే బరిలోకి దించాలని నాయకత్వం నిర్ణయించింది. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం-కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు-ఎం.అశోక్‌రెడ్డి, ఒంగోలు-దామచర్ల జనార్దన్, యర్రగొండపాలెంలో ఎరిక్సన్‌బాబు పోటీ చేయటం ఖాయమైంది.
మారుతున్న లెక్కలు: ఇదే సమయంలో జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పార్టీ మరుతారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో మహీధర్ రెడ్డి ఖండించారు. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన టీడీపీలో చేరటం ఖాయమంటూ నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఇక..ఇప్పుడు బీజేపీ తోనూ పొత్తు ఖాయమనే ప్రచారం వేళ..టీడీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి సీట్లు దక్కుతాయి..ఎవరికి పొత్తులో భాగంగా నష్టపోవాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. దీంతో..ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.