Follow Social Media Channels
Andhra Pradesh TDP party complaints over Fake Votes: అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఓటర్ జాబితా (AP Voter List)లో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని ఎలక్షన్ కమిషన్ (Election Commission)కు ఓ లేఖ రాశారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయని, ఎప్పుడో మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఇంకా తొలగించలేదు అని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నిచోట్ల మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయని ఈసీకి తెలిపారు.
పలుచోట్ల ఒకే డోర్ నెంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని, తక్షణమే వెరిఫై చేసి దొంగ ఓట్లు, నకిలీ ఓట్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఒకే ఓటు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు సైతం ఉన్నారని.. మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారని ఈసీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. దొంగ ఓట్ల వివరాలు, అందుకు సంబంధించిన వివరాలను జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలను షరీఫ్ సమర్పించారు.
ఏపీలో ఓటర్ జాబితా తప్పిదాలపై సాక్ష్యాధారాలు, వార్తా కథనాలను ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషన్కు రిక్వెస్ట్ చేశారు. ఇదివరకే టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల బృందాలు ఢిల్లీకి వెళ్లి ఎన్నికల ప్రధానాధికారిని కలిశాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు దొంగ ఓట్ల విషయంపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ సైతం ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయని వాదిస్తోంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, సాధ్యమైనంత త్వరగా దొంగ ఓట్లను, చెల్లని ఓట్లను తుది ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్కు శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు.