సచివాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి మండలి అమోదం తెలిపింది. దీనిని శాసనభలో ప్రవేశ పెట్టనున్నారు. నాలుగు నెలల కాలానికి దాదాపు 96వేల కోట్ల రుపాయల వ్యయ బడ్జెట్‌కు మంత్రి మండలి అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. .
నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రిమండలి అమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది.
నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి అమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించారు.
ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
పలు బిల్లుల అమోదం…
మరోవైపు ఆర్జీయుకేటీ, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ బిల్లులకు అమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు సభ మొదలవగా రైతాంగ సమస్యలపై టీడీపీ(TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఈరోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరాకరించారు.
సభ మొదలవగానే వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ( ఐఐఐటీలకు సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి సభలో ఏర్పడింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు.