Follow Social Media Channels
AP TET 2024 : ఏపీలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ వివరాలను మంత్రి బొత్త సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి టెట్ అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
టెట్ అర్హతలు
ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది.
అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.