Follow Social Media Channels
మారుతోన్న కాలంతో పాటు మోసాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు దాడి దోపిడీలు, ఇళ్ల దొపిడీలు చూశాం. ఇప్పుడు సైబర్ దొపిడీలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో కూర్చొని మన ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. మనుషుల అత్యాశను తమకు అనుకూలంగా మార్చుకుంటూ జేబులు లూటీ చేసేస్తున్నారు. ఇలాంటి ఎన్నో రకాల మోసాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘరానా మోసం బెంగళూరులో వెలుగు చూసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఏకంగా రూ. 158 కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. తాజాగా బెంగళూరు సిటీ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏమైందంటే.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా కొందరికి ఎర వేశారు కేటుగాళ్లు. ఎలాంటి అనుమానం రాకుండా ఫోన్ నెంబర్ల సహాయంతో మెసేజ్ చేశారు. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ కొట్టడం, పేజీలను ఫాలోకావడం, యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడం వంటి సులభమైన విధానాల ద్వారా సింపుల్‌గా డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపారు.
ఇందుకోసం ముందుగా కొంత సెక్యూరిటీ కింద డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వసూలు చేశారు. అనంతరం వీడియోలకు లైక్ కొడుతున్నా కొద్దీ.. డబ్బులు డిజిటల్ వాలెట్స్‌లో జమ అవుతున్నట్లు చూపించారు. అయితే డబ్బును విత్‌డ్రా చేద్దామని ప్రయత్నించేసరికి అసలు విషయం బయటపడింది. తమి డిజిటల్ ఖాతాలు నకిలీవని, మోసానికి గురైనట్లు తెలుసుకొని పోలీసును ఆశ్రయించారు.
విద్యారణ్యపురకు చెందిన ఓ బాధితుడు రూ. 18.5 లక్షలు పోగోట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సీసీబీ అధికారులు 30 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 62,8 లక్షలను ఫ్రీజ్ చేశారు. కర్ణాటకలో నమోదైన ఇలాంటి మొత్తం 265 కేసుల్లో బెంగళూరులోని 14 పోలీస్ స్టేషన్లలోనే 135 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్‌కు చెందిన నయాజ్, ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉందని తెలిపారు.